ముందు ఆర్టికల్లో 1931 లో మొదటి తెలుగు టాకీ సినిమా రిలీజ్ అయ్యింది అని తెల్సుకున్నాం కదా, అదేంటో ఆ చిత్రం వివరాలేమిటో చూద్దామా మరి...


చిత్రం                        భక్త ప్రహ్లాద 
విడుదల                   15-09-1931
నిర్మాణ సమయం      ౩౦ రోజులు 
స్టూడియో                  ఇంపీరియల్ స్టూడియో, బొంబాయి 
సినిమా నిడివి           9700 అడుగులు 


హైదరాబాద్ జాగిర్దార్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్న హెచ్. ఎం. రెడ్డి గారు, అప్పట్లో తాండవం చేస్తున్న ప్లేగు వ్యాధికి భయపడి బొంబాయిలో సినిమాలలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నతన బావమరిది హెచ్. వి. బాబు దగ్గరకు వచ్చేసారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని రెడ్డి గారికి సినిమా మీద ఆసక్తి కలగటానికి అంత సమయం కూడా పట్టలేదు. దాంతో ఆయన కూడా శారద ఫిలిం ఇన్స్టిట్యూట్లో రిఫ్లెక్టర్ బాయ్గా చేరారు. ఇదంతా 1927 నాటి మాట. ఆ పైన సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ సినిమవలోకనం చేసుకోసాగరు. ఆయనలో సినిమా పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన అర్దేషిర్ గారి ఇంపీరియల్ కంపెనీ రెడ్డి గారి దర్శకత్వంలో " ప్రిన్స్ విజయకుమార్ (1930) ", " ఏ మేజర్ ఇన్ లవ్ (1931) " అని 2 మూకీ సినిమాలను తీసింది. ఈ రెండిటిలోనూ ప్రధాన పాత్ర పృథ్వీ రాజ్ కపూర్ దే.




ఆలం ఆరా (1931) " ఘన విజయం సాధించటంతో అర్దేషిర్ ఇరానీ గారు దక్షిణ భాషలలో కూడా టాకీలను పరిచయం చెయ్యాలనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే తన వద్ద పని చేసిన హెచ్. ఎం. రెడ్డి గారికి మొదటి తెలుగు, తమిళ్ టాకీని తీసే అవకాశాన్ని ఇచి దక్షిణ భారతానికి టాకీలను పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కేలా చేసారు. ఇప్పటి 100ల కోట్ల మన సినీ పరిశ్రమకి తొలి పెట్టుబడి ఎంతో తెలుసా 15,000/- కంటే తక్కువే.  



సాంకేతిక వర్గం:
నిర్మాణం                         కృష్ణా ఫిల్మ్స్
సంగీతం                          హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి
సాహిత్యం                        చందాల కేశవదాసు
స్క్రిప్ట్                              సురభి నాటక సమితి
ఛాయాగ్రహణం                గోవర్ధన్ భాయి పటేల్
నిర్మాత - దర్శకుడు         హెచ్.ఎం.రెడ్డి


టాకీలు మొదలయ్యే నాటికి పౌరాణిక నాటకాలు విపరీతమైన హడావుడి చేసేవి కనుక అప్పటి ట్రెండ్ ప్రకారం పౌరాణికాలనే సినిమాలుగా తీయటం మొదలు పెట్టారు. అలా మొదలైంది మన " భక్త ప్రహ్లాద ". అప్పట్లో దాదాపుగా ఒక 19 ప్రహ్లాద నాటకాలు ప్రసిద్ధి అంట. వాటిలోనుండి ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన నాటకాన్ని ఆధారం గా తీసుకున్నారు. సురభి డ్రామా కంపెనీ వాళ్ళు దీన్ని ఆంధ్ర రాష్త్రం మొత్తం వేసేవాళ్ళు. 


అయితే ఆ నాటకాన్నే అచ్చు గుద్దినట్లు తీయలేదు రెడ్డిగారు. ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని ఈ సినిమాని తీసారు. సురభి కంపెనీలో అందరిని బొంబాయి తీసుకెళ్ళి వాళ్ళ ఏర్పాట్లు అన్నీదగ్గరుండి చూస్కుని సి.ఎస్.ఆర్ గారి ద్వారా వారిని ఒప్పించారు. అప్పటికి సి.ఎస్.ఆర్ ఇంకా నటన మొదలు పెట్టలేదు. ఈ సినిమాని చాలా పకడ్బందీగా తీసారు రెడ్డిగారు. కేవలం దర్శకత్వ శాఖనే  కాక నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనే చూసుకునే వారు. సినిమా పని అంతా పూర్తి అయ్యే వరకు నటీనటులతో సహా ఎవరికీ రషెస్ కూడా చూపించలేదు. "పరితాప భారంబు..." అనే పాటతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మన మొదటి హీరోయిన్ సురభి కమలాబాయి గారు ఆ పాట పాడారు


నటీనటులు:

హిరణ్యకశిపుడు              మునిపల్లె సుబ్బయ్య
లీలావతి                         సురభి కమలాబాయి
మొద్దబ్బాయి                  ఎల్.వి.ప్రసాద్
ప్రహ్లాదుడు                      సింధూరి కృష్ణారావు
ఇంద్రుడు                        దొరస్వామినాయుడు, బి.వి.సుబ్బారావు
బ్రహ్మ,                           చిత్రపు నరసింహారావు
చండామార్కులు

హిరణ్యకశిపుడిగా నటించిన మునిపల్లె సుబ్బయ్యగారి అసలు పేరు వల్లూరు వెంకట సుబ్బారావు, వారి ఊరు మునిపల్లె కావడం వల్ల మునిపల్లె సుబ్బారావుగా తెరకి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో మంచి పేరు రావటంతో తర్వాత ద్రౌపదిమానసంరక్షణం, సతి సులోచన... వంటి చిత్రాలలో నటించారు. ఇక సురభి కమలాబాయిగారి గురించి తెల్సుకోవాలంటే, ఆవిడకి పుట్టినిల్లె రంగస్థలం. కమలాబాయి గారి తల్లి గర్భినిగా నాటకం వేస్తున్నప్పుడే ఆవిడకి జన్మనిచ్చారు. అలా రంగస్థలం మీదే జన్మించిన ఆవిడే మన మొదటి హీరోయిన్ అయ్యారు. ఈ చిత్రానికి గాను ఆమెకు 500 /- పారితోషికం అనుకుని పూర్తి అయ్యాక 1116/- + రైలు ఖర్చులు కలిపి ఇచ్చి వీడ్కోలు చెప్పారు. అలా తెలుగు, తమిళ్, హిందీలలో వృద్ధాప్యం వచ్చే వరకు సినిమాలు చేసిన ఈవిడ పాతాళభైరవిలో ఎన్.టి.ఆర్కు తల్లి పాత్ర వేసారు.


ఇప్పుడు మన మొట్టమొదటి కథానాయకుడు కృష్ణారావు గురించి తెల్సుకుందాం. ప్రహ్లాదుడి పాత్ర కోసం ఒక 5 పిల్లలను తీసుకు వెళ్తే కృష్ణారావు "అమ్మ ఇటు బంగారు బండి నాకియ్యవే" అనే పాడారు. దాంతో ఆయననే ఎంపిక చేసారు రెడ్డి గారు. అంతకు ముందే ఆయనకు నాటకాలలో బాలకృష్ణుడు, కనకసేనుడు , ప్రహ్లాదుడు, లోహితాస్యుడు వంటి పాత్రలు వేసిన అనుభవం ఉంది. ఆయనకు ఈ సినిమాకి లభించిన పారితోషికం 400/-. కాకపోతే దీని తర్వాత మరే సినిమాలోను ఆయన నటించలేదు. 2001లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆయనను సన్మానించి 1,20,000/- ఆర్ధిక సాయం చేసింది. 2004లో కృష్ణారావు గారు మరణించారు. అయితే కనీసం ఏ పేపర్లోను కూడా ఈ వార్త రాకపోవటం బాధాకరం.


మొదటి భారత టాకీ "ఆలం ఆరా", మొదటి తెలుగు టాకీ "భక్త ప్రహ్లాద", మొదటి తమిళ్ టాకీ "కాళిదాసు" లలో నటించిన ఘనత ఎల్. వి. ప్రసాద్ గారికి దక్కింది. నెలసరి జీతానికి ఇంపీరియల్ కంపెనీలో నటుడిగా పని చేసేవారు. రాక్షస గురువు అయిన చండామార్కుల శిష్యుడు మొద్దబ్బాయి పాత్ర వెయ్యటమే కాకుండా ఈ సినిమాకి సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు. బొంబాయిలో రెడ్డి గారితో అయిన పరిచయం ద్వారా ఈ సినిమాలో నటించారు. ఏలూరులోని పాండురంగ హాలులో ఆయన తల్లి, కె.బి. తిలక్ (ప్రసాద్ గారి మేనల్లుడు, ప్రముఖ దర్శకుడు/నిర్మాత)తో కలిసి చూసారు.


అలా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏ.పి, మద్రాస్, కర్ణాటకలో కొన్నిప్రాంతాలలో, ఒరిస్సా ఇచ్చపురం ఇంకా కొన్ని ప్రాంతాలలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఎంతో మంది మెచ్చుకున్నారు, అదే విధంగా కొన్ని పత్రికల వాళ్ళు మొట్టారు కూడా. నాటకంగా అందరికి సుపరిచయం అయ్యి ఉండటంతోను, మాట బొమ్మలలో నాణ్యత లేకపోవటం వల్ల సినిమా చుసిన థ్రిల్ అంతగా కలగలేదంట అప్పటి వాళ్ళకి.


ఇదే సినిమాని తెలుగులో ఇంకో 2 సార్లు తీశారు. ఒకటి 1942లో శోభనాచలం బ్యానర్లో వస్తే, 1967లో ఏ.వి.ఎం వాళ్ళు ఎస్.వి.ఆర్, అంజలీదేవి, రోజా రమణిలతో కలర్లో తీశారు. ఈ రెంటికి చిత్రపు నారాయణమూర్తి గారే దర్శకుడు. భక్త ప్రహ్లాద తర్వాత హెచ్.ఎం.రెడ్డి గారు బి.ఎన్.రెడ్డి, కన్నాంబ గార్లతో కలిసి రోహిణి పిక్చర్స్ పెట్టి గృహలక్ష్మి, నిర్దోషి, ప్రతిజ్ఞ, ద్రౌపదిమాన సంరక్షణం, తెనాలి రామకృష్ణ తీశారు.


అలా 80 ఏళ్ళ క్రితమే ఏ మాత్రం సాంకేతిక సౌకర్యాలు లేకపోయినా ఎంతో కష్టపడి తెలుగు సినిమాకి విత్తనాన్ని వేసిన హెచ్. ఎం. రెడ్డి గారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోలేము. 1957 జనవరి 12 నుండి 20 వరకు మద్రాస్ లో చిత్ర రజతోత్సవం జరిగింది. అక్కడ తోలి తెలుగు టాకీ  మూలపురుషుడు అయిన రెడ్డి  గారిని, తొలి హీరోయిన్ కమలాబాయి గారిని సత్కరించారు.


1980 ప్రాంతంలో  బళ్ళారిలో ఈ సినిమాను చూసినట్లుగా సినీ జర్నలిస్ట్ ప్రదీప్ ద్వారా తెలిసింది. అయన పి.యు.సి చదువుతుండగా తెలుగు సంఘాల వారి కోసం ఈ సినిమాను వేస్తే చుసారంట. అచ్చం డ్రామా చుసిన భావన  కలిగిందని, ఆడియో/వీడియో నాణ్యత అస్సలు బాలేదని చెప్పారు. ఈ సినిమా ఒరిజినల్ నెగిటివ్ ని ఏ ఆర్కైవ్ లోను దాసిన దాఖలాలు లేవని కూడా తెలిపారు.

ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన ప్రింట్ కూడా దొరకట్లేదు. కనీసం పూణే ఫిలిం ఆర్కైవ్స్లో కూడా దీనిని భద్రంగా ఉంచకపోవటం మన దురదృష్టం అనే అనుకోవాలి. చరిత్రని భద్రపరుచుకొని స్మరించుకోవటంలో   మనకున్న (అ)శ్రద్ధ అటువంటిది కదా.

ఆధారం:
ఆనాటి ఆనవాళ్ళు - ఈ పుస్తకంలో మీరు సినిమా గురించి ఇంకెన్నోవిషయాలు తెలుసుకోవచ్చు. కొనాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి
(రచయిత -  పులగం చిన్నారాయణ)


No comments:

Post a Comment