లవకుశ

లవకుశ

సుధీర్ఘ విరామం తరువత మళ్ళీ ఎందుకో ఈ బ్లాగ్ పై ఆసక్తి కలిగి రాయటం ప్రారంభించాలి అన్న ఆలొచనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం...

ఇది మీరనుకుంటున్న లవకుశ కాదు. 1934 లో ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించగా సి.పుల్లయ్య గారు చిత్రీకరించిన మొదటి లవకుశ చిత్రం.

చిత్రం                :      లవకుశ
విడుదల తేది     :   23-12-1934

అలా తెలుగు  టాకీ ఊపిరి పోసుకుంటూ 1931లో భక్త ప్రహ్లాద, 32లో పాదుకా పట్టాభిషేకం, శకుంతల, 33 లో చింతామణి, పృథ్వీపుత్ర, రామదాసు (ఇంపేరియల్ వారిది ఒకటి ఈస్ట్ ఇండియా వారిది ఒకటి), సావిత్రి, సతీ సావిత్రి,1934లో అహల్య చిత్రాల నిర్మాణంతో స్థిరపడే మార్గాన్ని సుగమం చేసుకుంది. అదే తరుణంలో 34లోనే లవకుశ చిత్రం విడుదలయ్యి ఎన్నో సంచలనాలను సృష్టించింది.

తెలుగు  వారికి పూజ్యనీయమైన రామాయణంలో నుండి ఇంకా ఆసక్తికరమైన ఉత్తర రామచరితం ని ఆధారం చేసుకుని నిర్మించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన వారు సి.పుల్లయ్య గారు. తెలుగు  సినిమా కి పునాది వేసిన వారిలో ప్రముఖుడు పుల్లయ్య గారు. కాకినాడకు చెందిన ఈయన బి.ఎ పూర్తి చేసి ముంబయి కి వెళ్ళి సినిమాటోగ్రఫిలో ట్రైనింగ్ తీసుకుని 1932లో కొహినూర్ ఫిల్మ్ కంపెనీలో చేరి సినిమాకి సంబంధించిన అన్ని శాఖల్లో నైపుణ్యాన్ని సంపాదించారు. మద్రాసులో రఘుపతి వెంకయ్య గారు "స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలింస్ లిమిటెడ్" అనే కంపెనీ స్థాపించి మూకీ చిత్రాలను నిర్మించారు. వెంకయ్య గారి అబ్బాయి ఆర్.ఎస్.ప్రకాష్ "భీష్మ ప్రతిజ్ఞ" చిత్రీకరిస్తుండగా పుల్లయ్య గారు ఆయన దగ్గర సహాయకునిగా చేరారు.


సాంకేతిక వర్గం:
ప్రొడక్షన్                           ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ
సంగీతం                           ప్రభల సత్యనారాయణ
మాటలు - పాటలు               బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
స్క్రీన్ ప్లే                           వల్లభజోస్యుల రమణమూర్తి
నిర్మాత -దర్శకుడు:              సి.పుల్లయ్య

అలా తొలి అడుగులు వేస్తున్న ఆయన కొంత కాలానికి సొంతగా కెమేరా, లైట్స్ కొని కాకినాడలో ఆయన ఇంట్లోనే సెట్ వేసి మార్కండేయ తీసారు. అప్పట్లో మన రాష్ట్రంలో ధియేటర్లు లేని కారణంగా మద్రాసు కాని, కలకత్తా కాని వెళ్ళి సినిమా చూసే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆయనే కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ సినిమా పేరుతో ఒక చిన్న ధియేటర్ ని 1923లో నిర్మించారు. మినర్వా అనే పేరుతో ఆ ధియేటర్ ఇప్పటికీ ఉంది.

టాకీల హవాతో సినిమా లాభాన్ని చూపించే వ్యాపారంగా భావించి బెంగాల్ మార్వాడీలు నిర్మాతల అవతారమెత్తారు. బి.ఎల్.ఖేంక "ఈస్ట్ ఇండియా కంపెనీ" ని స్థాపించి తెలుగు  చిత్రాల బాధ్యతను పుల్లయ్య గారికి అప్పచెప్పారు. 1933లో రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు, సురభి కమలాభాయి గార్లతో 'సావిత్రి' సినిమాకి దర్శకత్వం వహించారు. ఇదే ఆయన మొదటి టాకీ సినిమా.

ఏస్ట్ ఇండియా వాళ్ళు హిందీలో దేవకి బోస్ దర్శకత్వంలో తీసిన 'సీత' లో పృథ్వీ రాజ్ కపూర్, దుర్గాఖోట్ రాముడు, సీతలుగా నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించటంతో తెలుగులో కూడా తీద్దామన్న ఆలోచన ఖేంకాకు కలిగింది. పుల్లయ్య గారికి కూడా సుబ్రమణ్య శాస్త్రి గారి లవకుశ నాటకాన్ని సినిమా గా తీయాలన్న కోరిక ఉండటంతో ఎంతో ఇష్టపడి ఇద్దరూ ఈ సినిమాని మొదలు పెట్టారు. సీతకు వాడిన సెట్స్, దుస్తులు, రాఢాలు మొదలైన వాటిని వాడుకున్నారు. రాధ కృష్ణ నాటకంలో రాముడి పాత్ర పోషించి పేరు తెచ్చుకున్న పారుపల్లి సుబ్బా రావును రామునిగా ఆయనకు దగ్గర పోలికలున్న ఈమని వెంకటరామయ్యను లక్ష్మణుడి పాత్రకు ఎంచుకున్నారు.

లవకుశలో సీతగా చేసిన సీనియర్ శ్రీరంజని గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పేపర్లలో పడిన క్లిప్పింగ్స్ ని కట్ చేసుకుని పసుపు కుంకుమలు పెట్టి సాక్షాత్తు సీతాదేవినే చూసుకుని పూజలు చేసేవారు. నాటకంలోని పద్యాలతో పాటు ఇందులో కొన్ని ప్రత్యేకమయిన పాటలు ఉపయోగించారు. అవి జనంలోకి వెళ్ళి బాగా ఆదరింపబడ్డాయి. రఘుకుల భూషణా, రఘురాముని చరితము వినవమ్మా, సత్యపాలనా ఘనా మొదలగు పాటలు ఊళ్ళల్లో ప్రజల నోట బాగా నానటమే కాక భజనల్లో కుడా ఉపయోగించేవారు. ఒక విధంగా తొలి మ్యూజికల్ హిట్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది ఈ లవకుశ. వంగ భాష (బెంగాళి) లో కుడా ఈ చిత్రం రావటం వళ్ళ పాటలు దాదాపుగ హిందుస్తానీ రాగల్లోనే ఉంటాయి. ప్రభల సత్యనారాయణ గారు సంగీతం అందించిన ఈ చిత్రంలో 21 పాటలు, 10 పద్యాలు ఉన్నాయి.

నటీనటులు:
శ్రీరాముడు              పారుపల్లి సుబ్బారావు
లక్ష్మణుడు             ఈమని వెంకటరామయ్య
భరతుడు               కె.నాగుమణి
శత్రుఘ్నుడు          చారి
వాల్మీకి                  పారుపల్లి సత్యనారయణ
వశిష్ఠుడు               మద్దూరి బుచ్చన్న శాస్త్రి
భద్రుడు                 కె. రామచంద్రారావు
సీత                      సీనియర్ స్రీరంజని
రజకుడు               డా.సిహెచ్.బి.వెంకటాచలం
లవుడు                మాస్టర్ భీమారావు
కుశుడు               మాస్టర్ మల్లేశ్వరరావు

తెలుగు  సినిమా పాటలు రికార్డ్ లు గా రావటం సతీ సావిత్రితో మొదలయ్యి ఈ సినిమాతో ఊపందుకుంది. కాకినాడ సన్ స్టూడియోస్ వాళ్ళు ఈ పాటలను విడుదల చేసారు. పాటల పుస్తకాలు ముద్రించిన మొదటి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా చూడటానికి ఊళ్ళ నుండి జనం బళ్ళు కట్టుకుని వచ్చీ జాతర వాతావరణాన్ని మరిపించారు. ఆ కాలంలోనే ఈ చిత్రం 40,000 వసూలు చేసి తెలుగు  టాకీకి తొలి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఆ రోజుల్లో ధియేటర్లో సినిమా వెయ్యటానికి ప్రింట్ కి కాంట్రాక్ట్ ఉండేది. జనప్రవాహం తగ్గాక ఆ ప్రింట్ ని వేరే ఊరుకి పంపకపోవటంతో మిగతా ఊర్ల జనం ఆగ్రహించే వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని 'చట్టెర్జీ-భూపాళ్' సౌండ్ సిస్టం వారితో ఒప్పందం కుదుర్చుకుని "సింగిల్ స్టార్ సింప్లెక్స్ ప్రొజెక్టర్" ని ప్రవేశపెట్టారు. అంతకు ముందు సినిమా వెయ్యటానికి మేకులు కొట్టి చెక్క ముక్కలతో ప్రొజెక్టర్లు తయారు చేసేవాళ్ళు. ఈ కొత్త ప్రొజెక్టర్ రావటంతో ఆ పాత పద్దతికి తెర పడింది. ఈ విధంగా కూడా తెలుగు  సినిమా మనుగడకు ఎదుగుదలకు ఎంతో దోహదపడింది ఈ చిత్రం.



ఈ చిత్రాన్ని పూర్తిగా నాటకం ఆధారంగానే తీసినా, నటన పరంగా, సాంకేతిక పరంగా మెరుగైన ప్రమాణాలను కనబరిచింది. తెలుగు  వారు చిత్ర నిర్మాణ రంగానికి రావటానికి కూడా ధైర్యాన్నిచ్చింది ఈ చిత్రం. ఇప్పటి వరకు లవకుశ కథతో పలు భాషల్లొ 11 సినిమాలు రాగా తెలుగులో మాత్రం ఇదే తొలి ప్రయత్నం. ద్వితీయ ప్రయత్నం కూడా సి.పుల్లయ్య గారే చెయ్యటం గమనార్హం. మొదటిది పూర్తి బ్లాక్ & వైట్ చిత్రం కాగా రెండవది ఎన్.టి.ఆర్., అంజలి దేవి గార్లు నటించి 1963లో వచ్చిన పూర్తి కలర్ చిత్రం.  

సౌజన్యం:
ఆనాటి ఆనవాళ్ళు (రచయిత - పులగం చిన్నారాయణ) - ఈ పుస్తకంలో మీకు ఇంకెన్నో వివరాలు దొరుకుతాయి. 
కొనాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి

1 comment:

reguvardan said...

ఛాలా బాగా చెప్పారు
News4andhra.com is a Telugu news portal and provides
Telugu Movie News, Latest and Breaking News on Political News and Telugu Movie Reviews at one place

Post a Comment